నవరసాలలో శ్రీ రామచంద్రుడు
కడునొప్ప జానకీ కళ్యాణ శుభలగ్న
కాలోత్సవంబు శృంగారరసము,
పట్టాభిషేక సంభ్రమ వేళ ముని వృత్తి
జనుమన్నజనుటయే శాంతి రసము,
తను నర మాత్రుగా దలచు తాటకనేయ
నట్టహాస స్ఫూర్తి హాస్యరసము,
పాదరేణువు సోకి పాషాణ మెలమితో
పొలతియై నిలుచుట ద్భుతరసంబు,
మాయా మృగంబైన మారీచు గనుగొని
భయదాస్త్ర మేయుట భయరసంబు,
కడగి వారథి మీద కదిసి లక్ష్మణుచేతి
విల్లంబు గొను వేళ వీర రసము,
తన బాణహతి బద్ధ దైత్యుల వికృ తాంగ
భావంబుజూడ భీభత్స రసము,
రాణివాస ద్రోహి రావణాసురు బట్టి
రణ వీధి ద్రుంచుట రౌద్ర రసము,
అల విభీషణుని లంకాధిపు చేయుచో
రూడికి నెక్కు కారుణ్య రసము,
నవ రసంబులు నీయెడ నాటు కొనియె
దశరథేశ్వర పుత్ర సీతా కళత్ర
తారక బ్రహ్మ కౌసల్య తనయ రామ
రాజ దేవేంద్ర పట్టాభి రామచంద్ర.
సేకరణ : మాచిరాజు రమణయ్య
0 comments:
Post a Comment